Bapps

మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటునే ఉంటాం

మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటునే ఉంటాం
ఉట్టి నేల మీది ఓడ నెక్కి ఒడ్డుకెళ్ళమంటాం
వాస్తవాలు చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంటాం
బొటన వేలితో నొసటి రాతలు చదువుతుంటాం
ఇదొక నిత్య నరకం అని నిందించి ఏం లాభం
సగటు మనిషి లోకం ఈ త్రిశంకు స్వర్గం
బొందితోనే అందుకున్నామని సంతోషిద్దాం

ఎప్పటికప్పుడు వేరే కొత్త కథలు చెప్పమందాం
భేతాళుడి మాటైతే బ్రతుకు ప్రయాణం
ఎక్కడికక్కడ సరేలే అని సర్దుకుపోయే తత్వం
తలకెక్కిందంటే ఇక తెలియదు భారం
ఫక్కుమనకంటూ దుఃఖమడ్డుపడితే
వెక్కి వెక్కి నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటే
విసుగెత్తి మనని విడిచిపోదా విషాదం

సుక్కలు లెక్కలు పెడుతూ మన చిక్కులు పోల్చుకుందాం
తక్కువే కదా అని తేలిక పడదాం
ఆస్తులు లేకపోతేనేం అప్పులు ఉన్నవాళ్ళం
అసలు లేని వాళ్ళ కన్నా నయమనుకుందాం
పస్తులు అనుకుంటే పరువుకి కష్టం
ఉపవాసముంటే ఏమిటంట నష్టం
ఆశకన్న ఆకలేమి ఎక్కువా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *